
మేడ్చల్,ఏప్రిల్11 :మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ నియంత్రణ మరియు నియంత్రణ పటిష్టత దినోత్సవం’ సందర్భంగా కండ్లకోయలోని సి.ఎం.ఆర్ ఫార్మసీ కళాశాలలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు, ర్యాలీ శనివారం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల ముగింపుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ సి. ఉమ గౌరి యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచనల మేరకే వినియోగించాలని సూచించారు. సైబరాబాద్ నార్కోటిక్స్ డీఎస్పీ పి. భిక్షపతి రావు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ యువతను అప్రమత్తం చేశారు.సి.ఎం.ఆర్ గ్రూప్ చైర్మన్ సి.హెచ్. గోపాల్ రెడ్డి ఔషధాల దుర్వినియోగంపై అవగాహన అవసరమని పేర్కొనగా, జిల్లా కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. వేణుగోపాల్ శర్మ మందుల విక్రయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి. లక్ష్మీ నారాయణ డ్రగ్స్ నియంత్రణ చర్యలు, QR కోడ్ వెరిఫికేషన్, ఫిర్యాదు వ్యవస్థపై వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, పెయింటింగ్, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫార్మసిస్ట్లు, కెమిస్ట్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
