
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ బగాయత్ లో నిర్మాణ దశలో ఉన్న కుల సంఘం భవన పిల్లర్ గుంతలో పడి ఇద్దరు మైనర్ బాలురు మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సుజాత, వెంకటేష్ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ కి వచ్చి ఉప్పల్ కుర్మా నగర్ లో ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మణికంఠ (15), రెండో కుమారుడు అర్జున్ (8) ఒక కూతురు ఉన్నారు. మంగళవారం ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కాగా ఆ ఇద్దరు పిల్లలు బుధవారం ఉదయం గుంతలో శవాలై తేలారు. బుధవారం ఉదయం స్థానికులు గుంతలో తేలుతున్న మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ ఎలక్షన్ రెడ్డి ఎస్ఐలు వీరితో పాటు హైడ్రా అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భగాయత్ లో కుల సంఘాల భవనానికి కేటాయించిన భూమిలో భవన నిర్మాణం జరుగుతున్న గుంతలో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమవ్వడంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.