Tirumala Darshan Accommodation Google AI Technology: తిరుమల శ్రీవారి దర్శనాలు, వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా.. గదులు కూడా సులభంగా తీసుకునేందుకు సరికొత్త ఆలోచన చేసింది. ఈ మేరకు త్వరలోనే అమలుకు సిద్ధమవుతోంది.. టీటీడీ గూగుల్‌తో ఒప్పందం చేసుకొని ఏఐని వినియోగించి భక్తులకు త్వరితగతిన దర్శనం, వసతి, సేవలు అందించేందుకు ప్రణాళికలు చేపడుతోంది. దీని కోసం గూగుల్‌తో త్వరలోనే ఒప్పందం చేసుకోనున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాాదిమంది భక్తులు వస్తారు. అయితే శ్రీవారి భక్తులకు త్వరగా దర్శనం కలిగేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి టీటీడీ సిద్ధమైంది. గూగుల్ ఉచితంగా ఏఐ అందించడానికి ముందుకు వచ్చింది. మరో వారం, పది రోజుల్లో టీటీడీ, గూగుల్ మధ్య ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు పూర్తి చేస్తారు. తిరుమలలో ముందుగా ఏఐని ప్రయోగాత్మకంగా ఉపయోగించి.. ఆ తర్వాత అవసరమైన మార్పులు చేస్తారు. ప్రస్తుతం కొన్ని దేవాలయాలు ఏఐని ఉపయోగిస్తున్నా.. అది కేవలం భక్తులకు సమాచారం ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది.
టీటీడీ మాత్రం దర్శనాలతో పాటు వసతి, ఇతర సేవల కోసం కూడా గూగుల్ సహాయం తీసుకోనుంది. ఏ సమయంలో, ఏ సీజన్లో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారనే సమాచారం టీటీడీకి తెలుస్తుంది. దీన్ని బట్టి భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేసుకోవచ్చు. దర్శనం ఎలా చేసుకోవాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, అక్కడ పాటించాల్సిన నియమాల గురించి యాత్రికులు ఏఐ సహాయంతో తెలుసుకోవచ్చు. వేర్వేరు దేశాల నుంచి భక్తులు వస్తుంటారు కాబట్టి, వారి భాషల్లోనే సమాచారం అందించనున్నారు.
గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎప్పటికప్పుడు రద్దీ ఎలా ఉందో తిరుమలకు వచ్చే భక్తులు తెలుసుకోవచ్చు. గదుల కోసం వచ్చే సీఆర్వో, ఆరోగ్య కేంద్రాలు, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణకట్ట వద్ద రద్దీ ఎలా ఉందో ఎవరినీ అడగకుండా ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. మొబైల్‌కే నోటిఫికేషన్లు వస్తాయి. ఈ సమాచారం టీటీడీకి కూడా ఉపయోగపడుతుంది. క్యూ లైన్లను కంట్రోల్ చేయడానికి, షెడ్లలో ఎక్కువసేపు నిరీక్షించకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
రద్దీని కంట్రోల్ చేసే పనులు త్వరగా చేయవచ్చు. తిరుమలలో గూగుల్ ఏఐ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారా అని పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది తెలుసుకుంటారు. వారిపై నిఘా ఉంచుతారు. నిందితుల ఫోటోలు కూడా భద్రంగా ఉంటాయి. ఏఐ టెక్నాలజీ ద్వారా దళారులను కూడా అడ్డుకోవచ్చు. దీనివల్ల మోసపోయే భక్తుల సంఖ్య తగ్గుతుంది. గూగుల్ ఏఐ ప్రాజెక్టు విజయవంతమైతే, ప్రతి భక్తుడికి ఒక స్పెషల్ పర్మినెంట్ ఐడీ వస్తుంది. భవిష్యత్తులో ఆ వ్యక్తి ఆ ఐడీ ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు? ఎన్ని గదులు తీసుకున్నారు? అనే సమాచారం టీటీడీకి తెలుస్తుంది.
సామాన్య భక్తులు తిరుమలలో ఎలాంటి ఇబ్బందీ పడకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఆయన సూచనలకు అనుగుణంగానే గూగుల్‌తో ఒప్పందానికి కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఏఐను వినియోగించి తక్కువ సమయంలో దర్శనం, గదుల కేటాయింపు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నాు. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా అధ్యయనం చేసి ఆచరణలో ఎదురయ్యే సమస్యలు తెలుసుకుంటామని.. వాటిని సరిదిద్ది ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు.