-మీడియా అకాడమీ చైర్మన్‌కు జడ్చర్ల జర్నలిస్ట్ సంఘం డిమాండ్లు బస్ పాస్, టోల్ ఫ్రీ ప్రయాణం, 100% సబ్సిడీతో పరికరాలు ఇవ్వాలి : జర్నలిస్టుల ఆకాంక్ష

ఉప్పల్ -:జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జడ్చర్ల జర్నలిస్ట్ సంఘం నాయకులు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా బస్ పాస్ సౌకర్యం కల్పించాలని, ప్రతి ప్రింట్ జర్నలిస్టుకు ల్యాప్టాప్, కెమెరా, వీడియో జర్నలిస్టులకు ల్యాప్టాప్‌తో పాటు వీడియో కెమెరాలను 100 శాతం సబ్సిడీపై అందించాలని వారు డిమాండ్ చేశారు.అలాగే అక్రిడేషన్ కార్డును ఆధారంగా చేసుకొని అన్ని టోల్ గేట్లలో ఫ్రీ టోల్ సౌకర్యం కల్పించడంతో పాటు, ప్రభుత్వ–ప్రైవేట్ అన్ని ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులు సమాజానికి సమాచార వారధిగా పనిచేస్తున్న నేపథ్యంలో వారి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించాలని నేతలు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జడ్చర్ల నుంచి వచ్చే జర్నలిస్టులకు ప్రత్యేకంగా రెండు రోజుల శిక్షణా తరగతులు నిర్వహించి, పూర్తి స్థాయి సర్టిఫికెట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల నైపుణ్యాభివృద్ధికి మీడియా అకాడమీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జడ్చర్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వడ్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం.డి. సుల్తాన్, ఉపాధ్యక్షుడు శేఖర్ తెలుగు, సంయుక్త కార్యదర్శి మల్లేష్, సీనియర్ పాత్రికేయులు, ఈసీ మెంబర్ తాంబూలం శ్రీనివాస్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
